- వాట్సప్‌లో వైరల్ చేస్తూ జనాల్ని భయపెడుతున్న ఆకతాయిలు
- అవన్నీ పుకార్లే.. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్న ఫారెస్ట్ ఆఫీసర్లు
- బోనులకు, కెమెరాల ట్రాప్‌లకు చిక్కకుండా..
మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతోన్న పులి - సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లావాసుల్లో ఆందోళన
హైదరాబాద్, వెలుగు : మూడు నెలల క్రితం మహారాష్ట్ర నుంచి బయలుదేరిన ఓ మగ పులి మూడు జిల్లాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. బోనుల్లో చిక్కకుండా.. ట్రాప్ కెమెరాలకు దొరకకుండా అలుపెరగని ప్రయాణం సాగిస్తోంది. ఈ పులి జాడ కోసం ఓ వైపు ఫారెస్ట్ ఆఫీసర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. మరో వైపు రోడ్లపైన, గ్రామ శివార్లలో పులి కనిపించినట్లు కొందరు ఆకతాయిలు ఏఐతో ఫేక్ వీడియోలు, ఫొటోలు తయారు చేసి వాట్సప్‌లో వైరల్ చేస్తున్నారు.
ఇప్పటికే నిజమైన పులి సంచారంతో భయాందోళనలో ఉన్న సిద్దిపేట, యాదాద్రి, జనగామ జిల్లా ప్రజలు.. ఈ ఫేక్ వీడియోలతో మరింత టెన్షన్ పడుతున్నారు. అసలు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక అయోమయంలో పడుతున్నారు. కాగా, ఫారెస్ట్ ఆఫీసర్లు మాత్రం వాట్సప్ గ్రూప్స్‌లో వస్తున్న పులి ఫొటోలు, వీడియోలు ఫేక్ అని చెబుతూ.. అసలైన పులి జాడ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు, ఏఐ ఫొటోలు వైరల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
మళ్లీ జనగామ జిల్లాలోకి..
యాదాద్రి జిల్లాలో సంచరించిన పులి మళ్లీ జనగామ జిల్లాలో అడుగుపెట్టింది. రఘునాథపల్లి మండలం మండెలగూడెం, లింగాలఘనపురం, కుందారం గ్రామ శివార్లలో గురువారం పెద్దపులి పాదముద్రలు కనిపించాయి. శుక్రవారం మండెలగూడెం గ్రామానికి చెందిన పరిశె రాజుకు చెందిన లేగదూడను చంపేసింది. అలాగే మండెలగూడెం గ్రామ శివారు నక్కబొక్కల తండా, పోతరాజు తండా పరిధిలోని వ్యవసాయ భూముల్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
దీంతో ఇక్కడ పులి సంచారం ఫేక్ కాదని, నిజమైన పులే తిరుగుతోందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని, పొలాల వద్దకు ఒంటరిగా వెల్లొద్దని సూచిస్తున్నారు. అత్యవసరమైతే గుంపులుగా, శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని చెబుతున్నారు. పంటల రక్షణ కోసం కరెంట్ తీగలు పెట్టొద్దని, దీని వల్ల పులికి హాని జరిగితే వన్యప్రాణి చట్టం కింద నాన్-బెయిలబుల్ కేసులు పెడుతామని హెచ్చరిస్తున్నారు. పులి కనిపించినా, పాదముద్రలు గుర్తించినా వెంటనే ఫారెస్ట్, పోలీస్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలని పీసీసీఎఫ్ సువర్ణ, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ లావణ్య పేర్కొన్నారు.
పదుల సంఖ్యలో పశువులపై దాడి
ఓ వైపు ఫేక్ పులుల బెడదతో జనం బెంబేలెత్తుతుంటే.. మరోవైపు నిజమైన పులి ఫారెస్ట్ ఆఫీసర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహారాష్ట్రలోని పాండవఖారా డివిజన్ తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి నవంబర్ చివరలో పెన్‌గంగా నది దాటి రాష్ట్రంలోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ అడవుల ద్వారా ప్రవేశించిన పులి అక్కడి నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో నిర్మల్, మంచిర్యాల జిల్లాలో కొన్ని రోజులు గడిపింది. అనంతరం అక్కడి నుంచి పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల గుండా ప్రయాణించి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించింది.
ప్రస్తుతం యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తోంది. ఈ మూడు నెలల కాలంలో వందల కిలోమీటర్ల పొడవునా తిరిగిన పులి తన ఆకలి తీర్చుకునేందుకు పదుల సంఖ్యలో లేగదూడలు, ఆవులను చంపేసింది. ముఖ్యంగా కవ్వాల్ నుంచి బయటకు వచ్చాక ఆహారం కోసం ఎక్కువగా పశువులనే టార్గెట్ చేసింది. పశువులను కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తామని ఫారెస్ట్ ఆఫీసర్లు భరోసా ఇస్తున్నారు.
మూడు జిల్లాల్లో హైటెన్షన్
వందల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ పులి ఎక్కడా స్థిరంగా ఉండకపోవడం ఆఫీసర్లకు సవాల్‌గా మారింది. పులి సంచరించే ప్రాంతాల్లో బోనులు పెట్టినా, ట్రాక్ కెమెరాలు అమర్చినా.. వాటికి చిక్కకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో సంచరిస్తోంది. అసలు పులి జాడే ఎరుగని ఈ జిల్లాల ప్రజలు.. మూడు నెలలుగా పొలాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.
పగలు వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా, రాత్రి పూట పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాలన్నా వెన్నులో వణుకు పుడుతోంది. అటవీశాఖ అధికారుల బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నా, డ్రోన్లతో గాలిస్తున్నా పులి మాత్రం చిక్కడం లేదు. అడవిలో ఉండాల్సిన పులి ఇప్పుడు జనావాసాలు, పంట పొలాల మధ్య తిరుగుతుండటంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల ఈ హైటెన్షన్‌కు ఎప్పుడు తెరపడుతుందోనని, పులిని ఎప్పుడు బంధిస్తారోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
